పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి: జేఏసీ
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ డిమాండ్ చేసింది.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఇప్పటికీ పూర్తికాలేదని, భూసేకరణ సమస్యలు, నిర్వాసితులకు న్యాయం చేయడంలో జాప్యం కారణంగా ప్రాజెక్టు ఆలస్యమవుతోందని పేర్కొన్నారు.
గట్టు ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోయాయని, వెల్దండ–గొండిమల్ల బ్యారేజ్ అంశం కూడా ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడం విచారకరమన్నారు.
మహబూబ్‌నగర్ రైతులు సాధించుకున్న కృష్ణా జలాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, డిండి ఎత్తిపోతల పథకం పేరిట పాలమూరు రైతాంగానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, వినియోగంలో అమలు చేస్తున్న విధానాలు తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు.
తక్కువ వర్షపాతం, కరువు పరిస్థితులను ఎదుర్కోవాలంటే పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం అత్యవసరమని జేఏసీ పేర్కొంది. జూలై 19న పెండింగ్ ప్రాజెక్టులపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించిన జేఏసీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేసింది.
