ఎస్‌ఐఆర్ ఫారాలను బీఎల్‌ఓలే నింపాలి: మెస్రం రాహుల్

జైనూర్, ఆంధ్రప్రభ: ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వే (ఎస్‌ఐఆర్) ఫారాలను లబ్ధిదారులతో నింపించకుండా బీఎల్‌ఓలే ఇంటింటికి వెళ్లి స్వయంగా పూర్తి చేయాలని సర్పంచుల సంఘం మాజీ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ మెస్రం రాహుల్ ప్రభుత్వాన్ని కోరారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేసి, వాటిని ప్రజలే స్వయంగా నింపాలని సూచిస్తున్నారని తెలిపారు.

కొమురం భీమ్ జిల్లాలో అధికంగా ఆదివాసీలు నివసిస్తున్నారని, నిరక్షరాస్యత కూడా ఎక్కువగా ఉండటంతో ఫారాలు నింపడంలో తప్పిదాలు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో అర్హులైన గిరిజనులు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి, ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి బీఎల్‌ఓలే స్వయంగా ఎస్‌ఐఆర్ ఫారాలను నింపే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ఆదివాసీ సంఘం నాయకుడు ఆత్రం జగదీశ్‌రావు, మడవి హన్ను, మడవి కొద్దు పటేల్, స్వామి, సచిన్, గేడం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.