మైనింగ్ శాఖలో సీఐడీ తనిఖీలు.. పత్రాల పరిశీలనతో కలకలం
మైనింగ్ శాఖలో సీఐడీ తనిఖీలు.. పత్రాల పరిశీలనతో కలకలం
మహబూబాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని మైనింగ్ శాఖ కార్యాలయంలో శుక్రవారం సీఐడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి వచ్చిన సీఐడీ బృందం నేరుగా కార్యాలయానికి చేరుకుని రికార్డులను పరిశీలించింది. సుమారు గంటన్నరపాటు కొనసాగిన ఈ తనిఖీలతో కార్యాలయ సిబ్బందిలో ఉత్కంఠ నెలకొంది. కార్యాలయంలోని పలు ఫైళ్లు, రిజిస్టర్లు, పరిపాలనా పత్రాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం.
తనిఖీల సమయంలో కార్యాలయంలో సాధారణ కార్యకలాపాలు కొంతమేర ప్రభావితమైనట్లు తెలిసింది. కొన్ని అంశాలపై సిబ్బందిని ప్రశ్నించినట్లు కూడా సమాచారం. అయితే తనిఖీలకు గల కారణాలను సీఐడీ అధికారులు వెల్లడించలేదు.మీడియా ప్రతినిధులు వివరాలు అడిగినప్పటికీ అధికారులు స్పందించేందుకు నిరాకరించారు. దీంతో ఈ తనిఖీల వెనుక కారణాలపై పలు చర్చలు సాగుతున్నాయి. దర్యాప్తులో భాగంగానే రికార్డులను పరిశీలించినట్లు భావిస్తున్నారు.
తనిఖీలు ముగిసిన అనంతరం కొన్ని ఫైళ్లను సీఐడీ అధికారులు వెంట తీసుకెళ్లినట్లు కార్యాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ ఫైళ్లు ఏ అంశాలకు సంబంధించినవన్నది మాత్రం తెలియరాలేదు. అధికారిక ప్రకటన లేకపోవడంతో పూర్తి వివరాలు గోప్యంగానే ఉన్నాయి. సీఐడీ బృందం రాక, రికార్డుల పరిశీలన జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీసింది.
