అంగన్‌వాడీ కేంద్రంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తనిఖీ

  • బాలింతలకు పోషకాహార కిట్ల పంపిణీ
  • సేవల నాణ్యతపై అధికారులను ఆరా..

అద్దంకి, ఆంధ్రప్రభ: అద్దంకి నియోజకవర్గంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం సందర్శించారు. అక్కడ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా బాలింతలకు పోషకాహార కిట్లను పంపిణీ చేసిన మంత్రి, వాటి నాణ్యత, పంపిణీ విధానంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోషకాహారం సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన తల్లులు, పోషకాహారం పొందిన చిన్నారులే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తారని మంత్రి అన్నారు. అందుకే ప్రభుత్వం తల్లి, శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

పోషకాహార పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేసిన మంత్రి, ప్రతి చిన్నారి, ప్రతి గర్భిణి, ప్రతి బాలింతకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.