ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
- ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు సొంత ఇంటి నిర్మాణం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారానే సాధ్యమవుతుందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు.
సోమవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు మండల కేంద్రం, యాదిరెడ్డిపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త ఇళ్లలోకి ప్రవేశించిన లబ్ధిదారులను అభినందించి, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల సముదాయం మాత్రమే కాదని, ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుకు భరోసా కల్పించే శాశ్వత ఆస్తి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తాడూరు సర్పంచ్ మల్లయ్య, మండల అధ్యక్షుడు యార రమేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, పీఏసీఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ గ్రామ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
