పద్మశ్రీ డా. పాలకొండ విజయానంద రెడ్డికి ఘన సన్మానం
మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : క్యాన్సర్ వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డా. పాలకొండ విజయానంద రెడ్డికి మహబూబ్‌నగర్ నగరంలోని రాజా బహదూర్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
పాలమూరు రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై డా. విజయానంద రెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, క్యాన్సర్ రోగులకు డా. విజయానంద రెడ్డి అందిస్తున్న సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. వేలాది మంది రోగులకు నూతన జీవితం ప్రసాదిస్తూ వైద్యరంగంలో విశేష సేవలు అందించారని అన్నారు. ఆయన సేవలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం గర్వకారణమని పేర్కొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవడం ప్రతి తెలుగు వానికి గర్వకారణమని, యువతకు ఆయన స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు మరింత అందుబాటులో వైద్య సేవలు అందిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, రెడ్డి సేవా సంఘం నాయకులు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జె. రాంమోహన్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
