ఉమామహేశ్వరుని సన్నిధిలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
ఉమామహేశ్వరుని సన్నిధిలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
- జిల్లా అభివృద్ధి, రైతాంగ శ్రేయస్సు కోసం ప్రార్థనలు
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ప్రకృతి సోయగాల నడుమ వెలసిన ఈ క్షేత్రానికి చేరుకున్న కలెక్టర్‌కు దేవస్థాన అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కుటుంబ సమేతంగా శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన అర్చనలు, అభిషేక పూజల్లో పాల్గొన్న ఆయన జిల్లాలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం అభివృద్ధి చెందాలని, జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి ఆలయ చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతను వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందని, ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారని తెలిపారు.

దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పరిశీలించి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న చర్యలపై వివరాలు సేకరించారు. ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రశాంతత, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం సందర్శన తమ కుటుంబానికి ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
