క్రైస్తవ ఐక్యగళానికి సన్నాహాలు.. ఐక్యతే సమాజ బలం: పాస్టర్లు
క్రైస్తవ ఐక్యగళానికి సన్నాహాలు.. ఐక్యతే సమాజ బలం: పాస్టర్లు
పాయకాపురం, ఆంధ్రప్రభ: సహోదరులు ఐక్యత కలిగియుండుట ఎంత మేలు, ఎంత మనోహరమో క్రైస్తవ సమాజం చాటిచెప్పాలని పలు సంఘాల పాస్టర్లు పిలుపునిచ్చారు. కండ్రికలోని కల్వరి ప్రేమ మందిర సహవాసం ఆవరణలో నిర్వహించిన క్రైస్తవ ఐక్యగళం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవ సేవకులు, ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులు, చర్చిల కూల్చివేతల అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 23న నగరంలోని జింఖానా మైదానంలో నిర్వహించనున్న క్రైస్తవ ఐక్యగళం సభ విజయవంతం కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.
ఈ సభలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, ఎల్‌సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకుమార్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేసి దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని, రాజ్యాంగంలోని 25వ అధికరణాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, క్రైస్తవ సమాజ భద్రత, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐక్య క్రైస్తవ సభలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లో క్రైస్తవులు ఐక్యంగా పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవ. బందెల దయానందం, రెవ. చంద్రపాటి దైవప్రకాశ్, కిరణ్ కుమార్‌తో పాటు వివిధ సంఘాల పాస్టర్లు పాల్గొన్నారు.
