మహిళా సాధికారతతోనే గ్రామాభివృద్ధి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: మహిళలకు సమాన హక్కులు, గౌరవం, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ పెర్క రిబ్కా సంతోష్ అన్నారు. గ్రామంలో నిర్వహించిన మహిళా సాధికారత, బాలసభ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగితే కుటుంబం బలపడుతుందని, కుటుంబం బలపడితే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

బాలసభల ద్వారా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ఆలోచనలు, ప్రజాస్వామ్య విలువలు పెంపొందుతాయని సర్పంచ్ తెలిపారు. నేటి పిల్లలే రేపటి దేశ భవిష్యత్తని, ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లి ఆరోగ్యంగా, మంచి సంస్కారాలతో ఎదగాలని ఆకాంక్షించారు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, పిల్లలపై హింస వంటి దురాచారాలను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కుమార్తెలకు కూడా కుమారులతో సమానంగా విద్య అందించాలని సూచించారు. గ్రామపంచాయతీ తరఫున మహిళల సంక్షేమం, పిల్లల విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రత కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేందర్‌రావు, సీఎలు తిరుమల, సుప్రియ, సంధ్య, స్వశక్తి సంఘాల సభ్యులు పాల్గొన్నారు.