వర్షాకాల వ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలి

ఊట్కూర్, ఆంధ్రప్రభ: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా డీఆర్డీఓ వెంకట్రాములు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. మంగళవారం ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామంలో నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఐకేపీ మహిళా సమాఖ్య భవనాన్ని పరిశీలించిన డీఆర్డీఓ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి మహిళా సంఘాల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం శిథిలావస్థకు చేరుకున్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించి, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని నిర్ణీత మెనూ ప్రకారం అందించాలని, వర్షాకాలంలో జ్వరం, డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాకిటి వెంకటేష్, ఉప సర్పంచ్ స్వాతి, పంచాయతీ కార్యదర్శి భవిత, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.