APSRTC | చిలకలూరిపేట డిపోలో ప్రయాణికుల కష్టాలు

  • పెరిగిన రద్దీ.. తగ్గిన సౌకర్యాలు
  • విద్యార్థులు, ఉద్యోగుల తీవ్ర ఇబ్బందులు
  • బస్సులు ఆగక రోడ్డుపై నిరసన
  • అదనపు సర్వీసులు కావాలని డిమాండ్

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం తర్వాత చిలకలూరిపేట ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను వినియోగించడం వల్ల ప్రజా రవాణాపై ఆదరణ పెరిగినా, అదే స్థాయిలో బస్సులు, సిబ్బంది, ప్రత్యేక సర్వీసులు పెరగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు పూర్తిగా నిండిపోతుండటంతో కొన్నిచోట్ల చిన్న స్టాపుల్లో బస్సులు ఆగడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఆగకపోవడంతో పలుచోట్ల ప్రయాణికులు బస్సులను అడ్డుకుని ఆందోళనకు దిగిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

విద్యార్థులకు బస్సు ప్రయాణం యుద్ధమే..

విద్యార్థులకు బస్సు పాసులు జారీ చేస్తున్నప్పటికీ, వాటికి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు లేకపోవడంతో ప్రతిరోజూ బస్సు ఎక్కడం యుద్ధంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు పూర్తిగా నిండిపోతుండటంతో బస్సు ఎక్కడానికి తోపులాట పడాల్సి వస్తోందని, కొన్నిసార్లు బస్సులో ఎక్కలేక కళాశాలలకు ఆలస్యంగా చేరుతున్నామని చెబుతున్నారు. పరీక్షలు, తరగతులు కూడా మిస్ అవుతున్నాయని, బస్సు పాస్ ఇవ్వడం మాత్రమే కాకుండా విద్యార్థుల కోసం ప్రత్యేక సర్వీసులు నడపాలని వారు కోరుతున్నారు.

డ్రైవర్లు, కండక్టర్లపై ఒత్తిడి..

ప్రయాణికుల రద్దీ పెరగడం, సమయపాలన, ప్రయాణికుల అసంతృప్తి కారణంగా డ్రైవర్లు, కండక్టర్లు కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రద్దీ కారణంగా కొన్నిసార్లు బస్సులు ఆపలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దాంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి.

డిపో మేనేజర్ యద్దనపూడి వేణుబాబు ఏమన్నారంటే..?

చిలకలూరిపేట డిపో పరిధిలో స్త్రీ శక్తి పథకం తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని డిపో మేనేజర్ యద్దనపూడి వేణుబాబు తెలిపారు. గతంలో 50% ఉండగా ప్రస్తుతం 80 శాతం పైనే పెరిగిందని ఈ మేరకు అధికారులకు అదనపు బస్సులు కావాలని ప్రపోజల్స్ పంపించినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సాధ్యమైనంత మేర సర్వీసులు నిర్వహిస్తున్నామని, బస్సులు ఆగడం లేదనే ఫిర్యాదులు వస్తే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. డిపోకు కాల పరిమిత పూర్తయిన బస్సులు స్థానంలో నూతన బస్సులు వస్తాయని తెలిపారు.

పురుష ప్రయాణికులకు సీట్లు ఏవి..? – రామారావు ప్రయాణికుడు..

పెరిగిన ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా బస్సులు పెంచడం లేదు. ప్రస్తుతం బస్సుల్లో పురుష ప్రయాణికులకు సీట్లు దొరకడం చాలా కష్టంగా మారింది. వృద్ధులు, ఉద్యోగులు, దూర ప్రాంతాలకు వెళ్లే పురుషులు గంటల తరబడి నిల్చునే పరిస్థితి ఏర్పడుతోంది. మహిళలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించినట్లే, పురుష ప్రయాణికులకు కూడా తగిన సంఖ్యలో సీట్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. విద్యార్థులకు బస్సు పాసులు ఇస్తున్నప్పటికీ, వారు ప్రతిరోజూ బస్సు ఎక్కడానికి యుద్ధం చేయాల్సి వస్తోంది. అదనపు బస్సులు, ప్రత్యేక విద్యార్థి సర్వీసులు ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది” అని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వమే పరిష్కార మార్గం చూపించాలి

ఏపీఎస్ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగిన మేరకు ఆర్టీసీ కొత్త బస్సులను ఏర్పాటు చేసే పరిస్థితుల్లో లేదని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే పెరిగిన ఆక్యుపెన్సీ మేరకు ఆర్టీసీలో పరిస్థితులు సమీక్షించి కొత్త బస్సులు ఏర్పాటు చేస్తే గాని పరిస్థితులు చక్కబడేలా లేవు. అప్పటివరకు ప్రయాణికులకు తిప్పలు తప్పవు అని విశ్లేషకులు చెప్తున్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు, విద్యార్థులకు ప్రత్యేక సర్వీసులు, అవసరమైన డ్రైవర్లు–కండక్టర్లను ఏర్పాటు చేస్తే చిలకలూరిపేట డిపో పరిధిలో ప్రయాణికుల ఇబ్బందులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ప్రయాణికులు అభిప్రాయ పడుతున్నారు.