Ration Rice | టెండర్ల పేరుతో వేల కోట్లు దారాదత్తం..?

Ration Rice | టెండర్ల పేరుతో వేల కోట్లు దారాదత్తం..?

Ration Rice | తిమింగలాలకు టెండర్ల కేటాయింపు..!
రూ.45 విలువైన బియ్యం.. రూ.21.70కే వేలం..!
రెండేళ్ల నిల్వలతో ప్రభుత్వానికి వందల కోట్ల కిరాయి భారం..!
రీఫాలిషింగ్ పేరుతో 56 వేల టన్నులు ప్రైవేట్ మిల్లులకు తరలింపు..!

Ration Rice | హైదరాబాద్, ఆంధ్రప్రభ : చదరంగం ఆటలోనే కాదు.. కొందరు అధికారుల ఆలోచనల్లో కూడా జిమ్మిక్కులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి సేకరించిన దొడ్డు బియ్యాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి ఆదాయం ఆర్జించే అవకాశం ఉండగా, కొందరి కాసుల కక్కుర్తికి అది దారి మళ్లిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఫిలిప్పీన్స్‌కు కిలో రూ.45 చొప్పున విక్రయించిన బియ్యం, ఇప్పుడు ప్రైవేట్ కాంట్రాక్టర్లు, తిమింగలాలకు వరంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా పౌరసరఫరాల శాఖలో టెండర్ల హడావుడి వెనుక, నిబంధనల ముసుగులో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రైవేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కిలోకు రూ.35 నుంచి రూ.40 వరకు ఖర్చు పెట్టి సేకరించిన బియ్యాన్ని, సగం ధరకే ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వానికి ఒక లెక్క… ప్రైవేట్ వారికి ఇంకో లెక్కా..?

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్, గన్నీ సంచులు, రవాణా, నిల్వ, నిర్వహణ ఖర్చులు కలిపితే కిలో బియ్యం విలువ రూ.35 నుంచి రూ.40 వరకు చేరుతుందని తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఒకవేళ రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సకాలంలో బియ్యం ఇవ్వక డిఫాల్ట్ అయితే, వారి నుంచి వడ్డీలు, పెనాల్టీలతో కలిపి కిలోకు రూ.38 నుంచి రూ.50 వరకు ప్రభుత్వం వసూలు చేస్తుంది. మరి మిల్లర్ల వద్ద అంత రేటు వసూలు చేసే ప్రభుత్వం, వేలం పాటల సమయంలో ప్రైవేట్ కంపెనీలకు కేవలం రూ.21.70కే (టన్నుకు రూ.21,700) ఎలా విక్రయించిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

రూ.45 నుంచి రూ.21.70కి పడిపోవడంలో పరమార్థమేంటి..?

సివిల్ సప్లైస్ కమిషనర్‌గా డి.ఎస్. చౌహాన్ ఉన్న సమయంలో ఫిలిప్పీన్స్‌కు కిలో రూ.45 చొప్పున దొడ్డు బియ్యం ఎగుమతి చేసి సంస్థకు భారీ ఆదాయం సమకూరింది. అనంతరం కూడా ఈ 56 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇతర దేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉండేది. కానీ కేవలం రూ.21.70కే విక్రయించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిలిప్పీన్స్ మంత్రి పర్యటనపై అనుమానాలు..!

ఇటీవల ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మంత్రి ఏప్రిల్ 12న కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మే 8న టెండర్లు పిలవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొందరు కోట్లు కొల్లగొట్టేందుకు చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని, రీఫాలిషింగ్ పేరుతో బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెండేళ్లుగా గోదాముల్లోనే నిల్వలెందుకు..?

టెండర్ ద్వారా అప్పగించిన బియ్యం నిల్వలు దాదాపు రెండేళ్లుగా వివిధ జిల్లాల బఫర్ గోదాముల్లో మగ్గిపోతున్నాయి. ఈ కాలంలో గోదాముల అద్దెలు, నిర్వహణ ఖర్చుల రూపంలో దాదాపు రూ.100 కోట్ల భారం ప్రభుత్వంపై పడిందని ఆరోపణలు ఉన్నాయి.

లాజిక్ లేని షరతులు..!

టెండర్ నిబంధనల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, బియ్యం ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో కొనుగోలు చేయాలనే షరతు. అంటే బియ్యం పుచ్చిపోయినా, నాణ్యత కోల్పోయినా కొనుగోలుదారుడే బాధ్యత వహించాలి. ప్రభుత్వం నాణ్యతపై హామీ ఇవ్వనప్పుడు, ప్రైవేట్ సంస్థ వందల కోట్లు పెట్టి ఆ బియ్యాన్ని ఎందుకు కొనుగోలు చేస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కరీంనగర్ కేంద్రంగా రీఫాలిషింగ్ దందా..?

రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల బఫర్ గోదాముల్లో ఉన్న 56,555 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ, ప్రస్తుతం దాన్ని కరీంనగర్, జమ్మికుంట, తిమ్మాపూర్ ప్రాంతాల్లోని 11 ప్రైవేట్ రైస్ మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కరీంనగర్ కలెక్టర్ నుంచి అనుమతులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది.

ముసురుతున్న అనుమానాలు..!

రీఫాలిషింగ్ ప్రక్రియలో బియ్యం పొట్టు పోవడంతో బరువు తగ్గుతుంది. ఈ తరుగును అధికారులు ఎలా లెక్కిస్తారు? దీనిపై పారదర్శక వ్యవస్థ ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

టెండర్ల పేరిట దోపిడీ..?

టెండర్ పత్రాలు, వర్క్ ఆర్డర్‌లోని క్లాజ్ డి, ఈ వివరాల ప్రకారం విజయవంతమైన బిడ్డర్ ఈ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ఏజెన్సీలకు, సహకార సంఘాలకు లేదా ఇతర రైస్ మిల్లర్లకు తిరిగి విక్రయించకూడదు. అలాగే ఈ నిల్వలను కేవలం దేశీయ వినియోగం కోసం మాత్రమే ఉపయోగించాలని, మానవ వినియోగానికి అనర్హమైతే పశువుల దాణా, చేపల మేత లేదా మద్యం తయారీకి మాత్రమే వినియోగించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

తుంగలో తొక్కుతున్న నిబంధనలు..!

నిబంధనల ప్రకారం పశువుల దాణాకు వినియోగించాల్సిన బియ్యాన్ని ప్రైవేట్ మిల్లుల్లో మళ్లీ పాలిష్ చేసి, కొత్త బ్రాండ్ సంచుల్లో నింపి మార్కెట్లో విక్రయించే ప్రమాదం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

విచారణ జరగాల్సిందే..!

దాదాపు 56 వేల టన్నుల బియ్యం, వందల కోట్ల రూపాయల విలువైన నిల్వలు, వృథా అయిన కిరాయిలు, సగం ధరకే వేలం పాటలు, అధికారుల అత్యుత్సాహం వంటి అంశాలు చూస్తుంటే పౌరసరఫరాల శాఖలో జరిగిన మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ అవసరమనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రజాధనంతో కూడిన ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి లేదా ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ప్రజాసంఘాలు, నిపుణులు కోరుతున్నారు.