ఈ నెల 15 నుంచి అమ‌రావ‌తి ఛాంపియ‌న్‌షిప్‌

  • జాతీయ క్రీడా దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హ‌ణ‌
  • విజేత‌ల‌కు మొత్తం రూ. 91.90 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తులు
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని ఏటా ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ఆగ‌స్టు 26 వ‌ర‌కు అమరావతి ఛాంపియన్‌షిప్–2026 పోటీలు జ‌ర‌గ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.

క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంకయ్య స‌మావేశ మందిరంలో అధికారులతో క‌లిసి ఛాంపియ‌న్‌షిప్ పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్‌లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనునున్న‌ట్లు తెలిపారు.

అండర్–17, అండర్–23 విభాగాలకు చెందిన వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చ‌ని.. రాష్ట్రవ్యాప్తంగా విజేత‌ల‌కు మొత్తం రూ. 91.90 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త‌మ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్‌షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంఘాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, జెడ్‌పీ సీఈవో డా. జె.అరుణ‌, డీఎస్‌డీవో కె.కోటేశ్వ‌ర‌రావు, జిల్లా యువ‌జ‌న సంక్షేమ అధికారి డా. కొల్లేటి ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.