విద్యాదానం మహాదానం

మండవల్లి , ఆంధ్రప్రభ:మండలం లోని లోకుమూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తాశ్రమం ఆధ్వర్యంలో వేమవరపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం సుమారు రూ.10 వేల విలువైన నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా దత్తాశ్రమం ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ గురజాడ ఉదయశంకర్ మాట్లాడుతూ.. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తోందన్నారు. సమాజంలో విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేపడుతున్న ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులకు వివరించారు.

కార్యక్రమంలో గురజాడ కనకదుర్గ, హరి మోహన్, బోయిన సత్య, గ్రామ పెద్దలు బోయిన గోవర్ధన్, అడవి ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సామ్రాజ్యం, ఉపాధ్యాయురాలు శ్రీమతి సీతా మహాలక్ష్మి, ఇతర ఉపాధ్యాయులు, దత్తాశ్రమం సభ్యులు పాల్గొని విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేశారు. నోట్‌బుక్స్ అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. “విద్యాదానం మహాదానం” అనే స్ఫూర్తితో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం గ్రామస్థులు, ఉపాధ్యాయుల ప్రశంసలను అందుకుంది.