ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై అసత్య ప్రచారాలు మానుకోవాలి: బొడ్డు గంగన్న
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై అసత్య ప్రచారాలు మానుకోవాలి: బొడ్డు గంగన్న
కడెం (ఆంధ్రప్రభ): ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి దుష్ప్రచారాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని కడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న అన్నారు. శుక్రవారం కడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే రూ.3 కోట్ల విలువైన కారు వినియోగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడిపై రాజకీయ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎమ్మెల్యేకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. గ్రామ గ్రామాన పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న ప్రజా నాయకుడిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నామని, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని హెచ్చరించారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలను తెలుసుకుని స్పందించాలని కోరారు. దుష్ప్రచారాలు ఎంత చేసినా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నాయకత్వంలో ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఆర్‌టీఏ సభ్యుడు మల్లేష్ యాదవ్, సర్పంచ్‌ల వేదిక కడెం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, జిల్లా యువజన కార్యదర్శి ముడికే మల్లేష్, కడెం పెద్దూర్ సర్పంచ్ దీకొండ విజయ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
