చింతల వెంకట్‌రెడ్డి మాతృమూర్తి సుభద్రమ్మ కన్నుమూత

చింతల వెంకట్‌రెడ్డి మాతృమూర్తి సుభద్రమ్మ కన్నుమూత

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మూడు దశాబ్దాలకు పైగా నిస్వార్ధంగా సేవలందించి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు స్వర్గీయ చింతల కృష్ణారెడ్డి సతీమణి, చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ వార్డు సభ్యుడు చింతల వెంకట్ రెడ్డి (రాజు) మాతృమూర్తి చింతల సుభద్రమ్మ శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. ​సుభద్రమ్మ మృతి చెందారనే వార్త తెలియగానే నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సంతాపం ప్రకటించాయి.

​కన్నీటి నివాళులు.. అండగా ఉంటామని పరామర్శ
​విషయం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు చింతల వెంకట్‌రెడ్డి నివాసానికి చేరుకుని సుభద్రమ్మ పార్థివదేహాన్ని సందర్శించారు. పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​”నాడు సర్పంచ్‌గా చింతల కృష్ణారెడ్డి చేసిన నిస్వార్థ సేవల్లో సుభద్రమ్మ పాత్ర ఎంతో ఉంది. వారి కుటుంబానికి ఈ నష్టం పూడ్చలేనిది.” అని నేతలు కొనియాడారు. ​ఈ సందర్భంగా తీవ్ర దుఃఖంలో ఉన్న చింతల వెంకట్ రెడ్డి (రాజు)ని, వారి కుటుంబ సభ్యులను నాయకులు ఓదార్చారు. వారికి తమ గాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.