వాగులో దిగబడిన సిమెంట్ లారీ..

  • నాసిరకం చెప్తాతో ప్రమాదం
  • మైలవరం బైపాస్‌లో ప్రమాదం..

మైలవరం, ఆంధ్రప్రభ : మైలవరం–నూజివీడు బైపాస్ హైవే నుంచి నారాయణనగర్‌కు వెళ్లే మార్గంలో వాగుపై నిర్మించిన చెప్తా (కాజ్‌వే)పై సోమవారం సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ దిగబడింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మైలవరం బైపాస్ నుంచి నారాయణనగర్‌కు వెళ్లే రహదారిలో డ్రైనేజీపై చెప్తా నిర్మించారు. అయితే నాసిరకంగా నిర్మించడంతో కొద్ది కాలంలోనే అది బీటలు వారింది. భారీ వాహనాల రాకపోకల కారణంగా చెప్తా మరింత దెబ్బతింటూ వచ్చింది.

సోమవారం సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ మలుపు తిరిగే సమయంలో చెప్తాపైకి ఎక్కడంతో అది ఒక్కసారిగా కుంగిపోయి లారీ వాగులో దిగబడింది. దీంతో చెప్తా ఒక వైపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు.

ఈ రహదారిని నారాయణనగర్ వాసులతో పాటు సాంఘిక సంక్షేమ, గిరిజన హాస్టళ్లకు వెళ్లే విద్యార్థులు కూడా వినియోగిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన చెప్తాను నాణ్యంగా పునర్నిర్మించి తమ ఇబ్బందులను తొలగించాలని స్థానికులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.