ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో రాస్తారోకో
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు మారం సందీప్, జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లకు చేరాయని, నిధులు విడుదల కాక వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ రాష్ట్ర కన్వీనర్ ఓమేష్, నగర కార్యదర్శి అరవింద్, నగర ఉపాధ్యక్షుడు విగ్నేష్, నాయకులు సిద్ధార్థ్, శివ, దినేష్, కార్తీక్, శైలజ, మౌనికతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
