ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి పిన్నెల్లి హితవు..
ఆంధ్రప్రభ, మాచర్ల : అక్రమ కేసులకు భయపడేది లేదని మాచర్ల మాజీ శాసనసభ్యులు, పల్నాడు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గం లో జూలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా అయ్యాక వైసిపి కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్యేగా ప్రజలు అవకాశం కల్పించినప్పుడు మంచి చేయాలి గాని, వేధింపు రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు తాళలేక 570 పైచిలుకు కుటుంబాలు వలసలు వెళ్లారని, ఆరు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారని అన్నారు.
పీడీ యాక్ట్ కేసుల్లో అప్పటి కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు సహకరించారన్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 15 నెలల కాలంలో ఎమ్మెల్యేగా జూలకంటి నియోజకవర్గంకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. మేక తోలు కప్పుకున్న తోడేలు లాగా పైకి నీతులు వల్లె వేస్తాడన్నారు.
ఎమ్మెల్యేగా నేనేం అభివృద్ధి చేశానో, ఆయన ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారన్నారు. పైకి తనకు ఏమీ తెలియదని చెబుతూనే నిన్నటి వరకు మంచికల్లు గ్రామంలో రేషన్ బియ్యాన్ని మిల్లులో పెట్టి అక్రమ వ్యాపారం చేసింది నీకు తెలియదా? ఇప్పుడు కంభంపాడు మెయిన్ రోడ్డులోని మిల్లులో అక్రమంగా రేషన్ తరలిస్తున్నది నీకు తెలియకుండానే జరుగుతుందా అని ప్రశ్నించారు.
నియోజకవర్గం ప్రజలు వరికపూడిశెల ప్రాజెక్టుకు అనుమతులు వైసిపి హయాంలో వచ్చినవేనని అన్నారు. ఎమ్మెల్యే జూలకంటి ఇప్పుడేదో తామే అన్ని చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేపు రాబోయే బడ్జెట్లో వరికపూడిశెలకు 3807 కోట్లు కేటాయించి పనులు మొదలు పెట్టేలా ఎమ్మెల్యే చూడాలన్నారు.
త్వరలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి మాచర్లలో జరుగుతున్న అక్రమ కేసులు వేధింపులపై వివరించనున్నట్లు రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇదే విధంగా నాయకులు, అధికారులు వ్యవహారిస్తే రాబోయే మా ప్రభుత్వంలో చట్టప్రకారం అందరిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
