Breakfast Milk Scheme | 29 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..
Breakfast Milk Scheme | 29 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..
రాజ్‌భవన్ పాఠశాలలో ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యం..
డ్రాప్‌అవుట్లను తగ్గించి హాజరు పెంచేందుకు చర్యలు
Breakfast Milk Scheme | ఆంధ్రప్రభ, హైదరాబాద్: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహారం-పాల పథకాన్ని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్వినీ రెడ్డి, కలెక్టర్ ప్రియాంక ఆల, డీఈవో యాదయ్య, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాల పథకం ద్వారా పౌష్టికాహారం అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా ప్రగతి దృష్ట్యా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం, డ్రాప్‌అవుట్లను తిరిగి పాఠశాలల్లో చేర్చడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ‘బడిబాట’ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ పథకానికి ప్రభుత్వం దాదాపు రూ.800 కోట్లు వెచ్చిస్తోందని వెల్లడించారు.

పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలంటే పౌష్టికాహారం ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. ప్రీ-ప్రైమరీ తరగతులు కూడా ప్రారంభమైన నేపథ్యంలో చిన్నారులు ఇంటి నుంచి అల్పాహారం తీసుకురావాల్సిన అవసరం లేకుండా పాఠశాలల్లోనే అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని కోరారు.
అల్పాహారం పథకం ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో ఆకలిని నివారించడం, పోషకాహార లోపాలను తగ్గించడం, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పడటం, పాఠశాల హాజరును పెంచడం, డ్రాప్‌అవుట్లను తగ్గించడం, ఏకాగ్రత మరియు విద్యా ప్రతిభను మెరుగుపరచడం లక్ష్యమని వివరించారు.

రోజు అల్పాహారం పాలు/రాగి మాల్ట్ ఇస్తున్నాం..
సోమవారం దోసె – చట్నీ / చపాతీ – కూర పాలు
మంగళవారం మిల్లెట్ ఇడ్లీ (2) – సాంబార్ రాగి జావ
బుధవారం పూరీ (2) – ఆలూ కుర్మా పాలు
గురువారం మిల్లెట్ ఇడ్లీ (2) – సాంబార్ రాగి జావ
శుక్రవారం మిల్లెట్ ఉప్మా / పొంగల్ – చట్నీ పాలు
శనివారం బొండా (2) – చట్నీ రాగి జావ
సోమ, బుధ, శుక్రవారాలు – పాలు
మంగళ, గురు, శనివారాలు – రాగి జావ
అల్పాహారం కోసం ప్రభుత్వం వార్షిక వ్యయం రూ. 540 కోట్లు ఖర్చు చేస్తుంది
పాల సరఫరా కోసం వార్షిక వ్యయం: రూ. 180 కోట్లు ఖర్చు చేస్తుంది..
మొత్తం వార్షిక వ్యయం రూ. 720 కోట్లు ఈ పథకానికి ప్రభుత్వం ఖర్చు చేయనుంది..
ఈ పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, విద్యా నాణ్యతను పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది..
హైదరాబాద్ జిల్లా పాఠశాల విద్యాశాఖ – అల్పాహార పథకం (2026-27) సంక్షిప్త నోట్
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార స్థాయిని మెరుగుపరచే లక్ష్యంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి అల్పాహార (Breakfast) పథకాన్ని అమలు చేయనుంది.
హైదరాబాద్ జిల్లాలో జిల్లాలో మొత్తం 672 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.
మొత్తం 93,501 మంది విద్యార్థులు చదువుతున్నారు.
మొదటి దశ అల్పాహారం కింద
హైదరాబాద్ జిల్లాలో 45 పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయి.
ఈ పథకం ద్వారా 12,437 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.
మన్నా ట్రస్ట్ (Manna Trust) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేయబడుతుంది.
ప్రాథమిక పాఠశాలలు: 23 (5,258 మంది విద్యార్థులు)
ఉన్నత ప్రాథమిక పాఠశాలలు: 2 (175 మంది విద్యార్థులు)
ఉన్నత పాఠశాలలు: 20 (7,004 మంది విద్యార్థులు)
విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఈ క్రింది ఆహార పదార్థాలు అందించబడతాయి:
ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్యం, పాఠశాల హాజరు, ఏకాగ్రత మరియు విద్యా ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
