జిల్లా అభివృద్ధే లక్ష్యం.. మంత్రుల సమన్వయం

జిల్లా అభివృద్ధే లక్ష్యం.. మంత్రుల సమన్వయం


ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసిన మంత్రి టీజీ భరత్, ఎంపీ నాగరాజు
సాగునీరు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చ

కర్నూలు, (ఆంధ్రప్రభ): జిల్లా అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడును రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లా పర్యటనలో భాగంగా కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, తాగునీటి సరఫరా, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై మంత్రులు చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పన, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా, వేగవంతంగా అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.