తూ..తూ.. మంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

తూ..తూ.. మంత్రంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

26 శాఖలకు 11 మంది అధికారులే హాజరు
సమయపాలన పాటించని అధికారులు.. నిరీక్షించిన ప్రజలు

ఆకివీడు, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం సోమవారం స్పష్టంగా కనిపించింది. ఆకివీడు మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కార్యక్రమం ప్రారంభ సమయానికి అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సమస్యలు వినిపించేందుకు వచ్చిన ప్రజలు నిరీక్షించాల్సి వచ్చింది. కొందరు ఫిర్యాదుదారులు కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదని భావించి వెనుదిరిగిన పరిస్థితి కనిపించింది.

26 శాఖలు.. హాజరు 11 మందే

పీజీఆర్ఎస్‌కు మొత్తం 26 శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా, కేవలం 11 మంది మాత్రమే హాజరయ్యారు. మిగిలిన శాఖల అధికారులు గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది.

ఇన్‌చార్జి పేరుతో గైర్హాజరు

పలు శాఖలకు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న అధికారులు మరో మండలంలో కార్యక్రమానికి హాజరవుతున్నామని చెబుతున్నప్పటికీ, తమ స్థానంలో సిబ్బందిని పంపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న మండలంలో శాఖ తరఫున ఎవరూ లేకపోవడం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది.

పోలీస్ శాఖ ఎక్కడ?

ఇటీవలి కాలంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో పోలీస్ శాఖ ప్రాతినిధ్యం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కూడా పోలీస్ శాఖ అధికారులు హాజరు కాలేదు.

అదేవిధంగా ఫిషరీస్, ఫారెస్ట్, వెలుగు శాఖల తరఫున కూడా అధికారులు లేదా ప్రతినిధులు హాజరుకాకపోవడం అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మరికొన్ని శాఖలు కూడా ఇదే బాటలో నడవడం గమనార్హం.

ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వేదికలోనే అధికారులు సమయపాలన పాటించకపోవడం, పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, పీజీఆర్ఎస్‌ను ప్రజలకు నిజమైన సమస్యల పరిష్కార వేదికగా మార్చాలని కోరుతున్నారు.