ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి

  • జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.గురువారం మండలంలోని చల్లగరిగ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, మధ్యాహ్న భోజనశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్, వేసవి సెలవులు ఎలా గడిపారో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులంతా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని సూచించారు.పాఠశాలలో మౌలిక వసతులు, సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పటికీ విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నమోదు, హాజరు శాతాలను పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్, భోజనం నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి జ్ఞానాన్ని పరిశీలించారు. బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించేందుకు గ్రంథాలయంలో పుస్తకాలను అందుబాటులో ఉంచాలని, గ్రంథాలయ కార్డుల నిర్వహణ చేపట్టాలని సూచించారు. అనంతరం రుచికరమైన భోజనం అందించిన వంట సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీవో జయశ్రీ, ఎంఈవో రఘుపతి, సర్పంచ్ జంపయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.