ACB అధికారులకు చిక్కిన అవినీతి అధికారి..

  • లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భూ సర్వే అధికారి
  • సర్వే నివేదిక కోసం రూ.35 వేల డిమాండ్
  • రూ.15 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

నల్గొండ, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భూమి సర్వే నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ శాఖ అధికారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌గా పనిచేస్తున్న జి. పవన్ కుమార్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి తల్లి, పిన్నికి సంబంధించిన భూముల సర్వే నివేదిక అందజేయడానికి పవన్ కుమార్ మొత్తం రూ.35 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.20 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు విచారణలో తేలింది. మిగిలిన రూ.15 వేలను శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ సమీపంలో స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి రూ.15 వేల లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనను అరెస్ట్ చేశారు. అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. అరెస్టు చేసిన పవన్ కుమార్‌ను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.