కంచనపల్లిలో ప్రయాణికులకు నిలువు నీడ కరువు…
కంచనపల్లిలో ప్రయాణికులకు నిలువు నీడ కరువు…
- బస్సులు ఆగేది ఒకచోట… బస్టాండ్ కట్టింది ఒకచోట
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలో బస్టాండ్ సెంటర్ వద్ద ప్రయాణికులకు నిలువు నీడా లేదు. దీంతో ఆయా గ్రామాల నుండి వచ్చే వారు, ఇతర గ్రామాలకు పోయే వారు ఎండలో ఇబ్బందులు పడుతున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు బస్టాండ్ మాత్రం ఊరికి చివరలో పాఠశాల వద్ద కట్టడం విడ్డూరం. అవసరం ఒక చోట కట్టింది ఒక చోట. మునుగోడు చౌటుప్పల్ ప్రధాన రహదారిపై ఈ కంచనపల్లి ఉండడంతో పాటు అప్పాజీపేట, బుద్ధారం, ఔరవాణి గ్రామస్తులు సైతం ఇతర గ్రామాలకు వెళ్లి ఇక్కడ దిగి ఆటోల్లో తమ గ్రామాలకు వెళ్తుంటారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నారులు రోడ్డుపై నిలిచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ రహదారి కావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జంకుతున్నారు. ఎలాగైనా రహదారిపై గ్రామ మధ్యలో అన్ని హంగులతో విశాలంగా బస్టాండ్ నిర్మించాలని, అందులో గ్రామ పంచాయతీ పర్యవేక్షణలో ఫ్యాన్లు , కుళాయి సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
