బాల్క సుమన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బాల్క సుమన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్
చెన్నూర్, ఆంధ్రప్రభ: మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటీవల టీజేబీకేఎస్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రవాదం, గూండాయిజం, రౌడీయిజాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయని విమర్శించారు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగాన్ని అభివృద్ధి చేస్తూ వందే భారత్ రైళ్లు, బుల్లెట్ ట్రైన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతుంటే, రైల్వే ట్రాక్‌లు, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు సంవత్సరాలుగా అధికారానికి దూరమైన తర్వాత రైతులు తమ వద్దకు రావడం లేదని, తమ ఉద్యమాల్లో పాల్గొనడం లేదనే అసహనంతో కార్యకర్తలకు మిలిటెంట్ ఉద్యమాలు చేయాలని పిలుపునివ్వడం అసాంఘిక శక్తులను ప్రోత్సహించడమేనని అన్నారు.
అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేయించిన విషయాన్ని బాల్క సుమన్ మరిచిపోయారని విమర్శించారు. అదే ధోరణిని కొనసాగిస్తూ ప్రస్తుతం అధికార పక్షంపై దాడులు చేయాలని కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తెలంగాణ యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని, ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపర్తి వెంకటేశ్వర్, కౌన్సిలర్ గర్రెపల్లి శాంతా వెంకటనర్సయ్య, కోటపల్లి మండల నాయకుడు పెద్దింటి పున్నంచంద్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
