శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం: డీఎస్పీ శ్రీనివాసులు
వేములవాడ, ఆంధ్రప్రభ: ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు శుక్రవారం కొనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామం, కమ్మరిపేట తండాల్లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 39 ద్విచక్ర వాహనాలను గుర్తించారు. అవసరమైన పత్రాలు సమర్పించిన అనంతరం మాత్రమే వాహనాలను తీసుకెళ్లాలని యజమానులకు సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల వివరాలు, వారి కదలికలపై కూడా ఆరా తీశారు.
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, నేరాలను నియంత్రించడం, ప్రజల రక్షణను మరింత బలోపేతం చేయడమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ఉద్దేశమని డీఎస్పీ తెలిపారు. గ్రామాలు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాపై సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రజా జీవనానికి విఘాతం కలిగించే లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో చందుర్తి సీఐ రవీందర్, ఎస్ఐలు ప్రశాంత్‌రెడ్డి, రమేష్, మోతీలాల్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
