కొత్తపల్లిలో ‘డ్రై డే’
పారిశుధ్యంపై అవగాహన
నిల్వ నీటిని తొలగించి దోమల నివారణకు చర్యలు
డెంగీ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు సర్పంచ్ సూచనలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఆర్. నర్సిములు అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం ‘డ్రై డే–ఫ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వర్షాకాలంలో ఇళ్ల పరిసరాల్లో మురుగు నీరు, నిల్వ నీరు ఉండటం వల్ల దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. నిల్వ నీటిలో లార్వా అభివృద్ధి చెందకుండా ప్రతి కుటుంబం తమ ఇంటి ప్రాంగణం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా మంచినీటి బావులు, తొట్టెలు, డ్రమ్ములు తదితర నీటి వనరుల వద్ద క్రిమిసంహారక మందులు పిచికారీ చేసి, పారిశుధ్య చర్యలు చేపట్టారు. ఈ అవగాహన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివశంకర్తో పాటు గ్రామ ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.
