రూఫ్ టాప్ సోలార్ వినియోగదారుల బిల్లుల సెటిల్మెంట్ వేగవంతం
- వినియోగదారులకు పారదర్శక, సత్వర సేవలే లక్ష్యం
- ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ఎపిఎస్పిడిసిఎల్ లో గ్రిడ్ కు అనుసంధానమైన రూఫ్ టాప్ సోలార్ వినియోగదారుల విద్యుత్ బిల్లుల సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లో తేటి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. సోలార్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యంగా ముందుకెళుతున్నామని పేర్కొన్నారు.
రూఫ్ టాప్ సోలార్ వినియోగదారులు ఉత్పత్తి చేసిన అదనపు విద్యుత్తును గ్రిడ్ కు అందించడం ద్వారా రాష్ట్ర ఇంధన రంగ అభివృద్ధికి తమవంతు తోడ్పాటును అందిస్తున్నారన్నారు. వినియోగదారులకు బిల్లుల సెటిల్మెంట్ ను సకాలంలో, పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ఎపిఎస్పిడిసిఎల్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. గతంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి సోలార్ మిగులు యూనిట్లకు సెటిల్మెంట్ ప్రక్రియ జరిగేదని, ప్రస్తుతం ప్రతి నెలా బిల్లింగ్ సైకిల్ దిగుమతి-ఎగుమతి విద్యుత్తు యూనిట్ల ఆధారంగా ఖచ్చితమైన విధానంతో బిల్లులను రూపొందించి, నిబంధనల మేరకు సెటిల్మెంట్ చేస్తున్నామని వివరించారు.

ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అంనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మొత్తం 128 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 36,963 మంది వినియోగదారులు స్వయంగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకున్నారని వివరించారు. విద్యుత్ వినియోగం, విద్యుత్ ఉత్పత్తి మిగులు ఆధారంగా వారికి ఈ యేడాది జూన్ లో రూ.83.88 లక్షలు, అలాగే జులైలో రూ. 68.40 లక్షల మేరకు విద్యుత్తు మిగులు యూనిట్ల బిల్లులను నేరుగా వినియోగదారుల బ్యాంక్ అకౌంట్లకు జమ చేయడం జరిగిందని తెలియజేశారు.
సోలార్ విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులకు మార్గదర్శకాలను జారీ చేశామని తెలిపారు. బిల్లింగ్ కు సంబంధించిన అంశాల్లో సందేహాలు ఉత్పన్నమైతే తమకు సమీపంలోని అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కార్యాలయాన్ని గానీ లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయాన్ని గానీ సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవడం లేదా సమస్యకు పరిష్కారం పొందవచ్చని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్-ఫ్రీ నం: 1912 గానీ లేదా 1800 425 155333 కు కాల్ చేయడం, వాట్సాప్ నంబరు : 91333 31912 కు చాట్ చేయడం ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు వినియోగదారుల నుంచి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో బిల్లింగ్, నెట్ మీటరింగ్, నెలవారీ సెటిల్మెంట్ ప్రక్రియలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలనుకుంటున్న అర్హులైన గృహ వినియోగదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత వివరాలకు సమీప విద్యుత్ కార్యాలయం లేదా ఎపి ఎస్పిడిసిఎల్ అధికారిక వెబ్సైట్ ను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా సూచించారు.
