అమృత్ 2.0 పనులను వేగవంతం చేయాలి
అమృత్ 2.0 పనులను వేగవంతం చేయాలి
- ఎమ్మెల్యే గడ్డం వినోద్, అదనపు కలెక్టర్ చంద్రయ్య
- బెల్లంపల్లి మున్సిపాలిటీలో తాగునీటి అభివృద్ధి పనుల క్షేత్రస్థాయి పరిశీలన
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ‘అమృత్ 2.0’ పథకం కింద చేపడుతున్న తాగునీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, అదనపు కలెక్టర్ చంద్రయ్య గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పైప్‌లైన్ నిర్మాణం, ఓవర్ హెడ్ రిజర్వాయర్ పనుల పురోగతిని వారు నిశితంగా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పనుల ప్రస్తుత స్థితి, పూర్తి కావలసిన గడువుపై సమగ్ర నివేదికను సమర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. అమృత్ 2.0 పథకం ద్వారా పట్టణ ప్రజలందరికీ మెరుగైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ పనుల అమలులో పారదర్శకత, వేగం పెంచాలని సూచించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, డీఈలు, ఏఈలు, కాంగ్రెస్ లీడర్లు కార్కూరి రాంచందర్, బండి ప్రభాకర్ యాదవ్, చిలుముల శంకర్, దావా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
