భూసేకరణలో అవినీతిపై క్రిమినల్ చర్యలు తప్పవు
భూసేకరణలో అవినీతిపై క్రిమినల్ చర్యలు తప్పవు
నిర్వాసితులకు పరిహారం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరిక
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : పోలవరం ప్రాజెక్ట్ భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం పంపిణీ వంటి అంశాల్లో అవినీతికి పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.
బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూసేకరణ, రహదారుల భూసేకరణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు కర్తవ్యనిష్ఠతో పనిచేయాలని సూచించారు.
నిర్వాసితులకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పునరావాస పరిహారం పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పరిహారం, నిర్వాసితుల గుర్తింపు, గృహ నిర్మాణ పనుల్లో అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, ఇది అత్యంత తీవ్రమైన విషయమని తెలిపారు.
అవినీతికి పాల్పడే వారి వివరాలను ఆధారాలతో సహా 9491041188, 18002331077, 08812224519 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. ఫిర్యాదులపై వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ ఫోన్ నంబర్లపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని, తహసీల్దార్ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న 1443 ఇళ్లలో జూన్ రెండో వారానికి 50 శాతం నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా గృహ నిర్మాణ అధికారి సత్యనారాయణను ఆదేశించారు. అర్హులైన నిర్వాసితుల వివరాలను వెంటనే సమర్పించాలని సూచించారు.
జిల్లాలో రహదారులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, సెల్ టవర్ల భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఐటిడిఏ పీఓ రాములు నాయక్, ఆర్డీవోలు కె. లక్ష్మి ప్రసన్న, రమణ, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
