కుంటుపడిన అభివృద్ధికి పరుగులు పెట్టిస్తా

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ ఊపిరి పోసి వేగవంతం చేయడమే తన లక్ష్యమని 4వ వార్డు బీజేపీ అభ్యర్థి కొండా శ్వేత సత్యాయాదవ్ తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం అని పేర్కొంటూ, ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్నానన్నారు. ప్రధాన వీధుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. “మీ ఇంటి సమస్యలే నా సమస్యలు… మీ బాధలే నా బాధలు” అని భావోద్వేగంగా స్పందించిన ఆమె, ప్రజల సహకారం ఉంటే సమగ్ర అభివృద్ధి సాధ్యమని నమ్మకం వ్యక్తం చేశారు.

యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల భద్రత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. తాను ప్రజల్లో ఒకరిగా పనిచేస్తానని, ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని తెలిపారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. 4వ వార్డులో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా కొండా శ్వేత సత్యాయాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డు పరిధిలోని కాలనీల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలే తనకు బలంగా మారాయని పేర్కొన్నారు.

తాగునీరు, రహదారులు, కాలువలు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేసిన తాను, ఈసారి మరింత సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్లు తెలిపారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో వార్డు అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ వార్డు అభివృద్ధి ప్రణాళికలను వివరించడంతో పాటు ప్రజల సూచనలు స్వీకరిస్తున్నారు. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ప్రజాసేవను మరింత బలపరచడానికి ఈ ఎన్నికలు కీలకమని పేర్కొన్నారు.

వార్డు పరిధిలోని పలు కాలనీల ప్రజలు కూడా కొండా శ్వేత సత్యాయాదవ్‌పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకుంటూ ఈసారి కూడా ఆమె విజయం ఖాయమని స్థానికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 4వ వార్డులో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తుండగా, కొండా శ్వేత సత్యాయాదవ్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వార్డులో రాజకీయ వాతావరణం హీటెక్కగా, ఆమె ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటోంది.