సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్

తొర్రూరు, ఆంధ్రప్రభ: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ సూచించారు.గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్యాంసుందర్ అధ్యక్షతన సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పట్టణంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ద్వారా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

ప్రతి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. తడి చెత్తను పచ్చ బుట్టలో, పొడి చెత్తను నీలం బుట్టలో వేయడం ద్వారా వ్యర్థాల నిర్వహణ సులభతరం అవుతుందని చెప్పారు.

చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. పరిశుభ్రమైన పట్టణ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఆరోగ్యకరమైన సమాజం కోసం అందరూ పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తొర్రూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.