ధాన్యం కొనుగోలు కేంద్రంలో సంక్షోభం… రోడెక్కిన గ్రామస్తులు

ధాన్యం కొనుగోలు కేంద్రంలో సంక్షోభం… రోడెక్కిన గ్రామస్తులు

మోత్కూరు, ఆంధ్రప్రభ: సదర్శాపురం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం ఎగుమతి కోసం లారీలు రాకపోవడంతో రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. సదర్శాపురం–కంచనపల్లి స్టేజి వద్ద మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

గత ఐదు రోజులుగా లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాశులు అలాగే నిల్వ ఉండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండల్లో ధాన్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఇప్పటివరకు కేవలం ఐదు లారీల ధాన్యం మాత్రమే ఎగుమతి కాగా, ఇంకా సుమారు 20 లారీల ధాన్యం కేంద్రంలో నిల్వ ఉందని పేర్కొన్నారు.

వర్షాకాలం సమీపిస్తుండటంతో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితిలో ధాన్యం రాశులను కాపాడుకోవడం కష్టమవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మిల్లర్లు 40 కిలోల బస్తాకు ఒక కిలో అదనంగా తీసుకుంటున్నారని, తరుగు పేరుతో మరో కిలో ధాన్యం కోత విధిస్తున్నారని ఆరోపించారు.

అదేవిధంగా బస్తాకు రూ.10 ఇవ్వాలని మిల్లర్లు, రూ.5 ఇవ్వాలని లారీ, డీసీఎం డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారని రైతులు తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఐకేపీ కేంద్రానికి లారీలు ఏర్పాటు చేసి ధాన్యం ఎగుమతిని వేగవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతులు దొండ సోమయ్య, తీగల సోమిరెడ్డి, తీగల వెంకటయ్య, గొట్టే సతీష్, ఉయ్యాల గణేష్, గంగాపురం సోమ నరసయ్య, తుంగపాటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply