Andhra Pradesh Smart City Project | ఏపీకి స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు
Andhra Pradesh Smart City Project | ఏపీకి స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టు
Andhra Pradesh Smart City Project | ఇంధన పొదుపు సంస్థతో భాగస్వామ్యం
30 శాతం విద్యుత్ శక్తి ఆదా
ఆరు నెలల వ్యవధిలో రెండు దశల్లో అమలు
10.5 లక్షల లైట్ల వీధిలైట్లు ఆధునీకరణ
లైటింగ్ సామర్థ్యం 150 ల్యూమెన్స్‌కు పెంపు
నేడు కమర్షియల్ బిడ్ ప్రక్రియ ప్రారంభం
Andhra Pradesh Smart City Project | అమరావతి, ఆంధ్రప్రభ: ఇక పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాత్రివేళల్లో వీధుల్లో వెలుగులు విరజిమ్మనున్నాయి. సుస్థిర పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోనే అతిపెద్ద స్మార్ట్ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈమేరకు అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లో రానున్న ఆరు నెలల కాలంలో అమలుకు నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)తో చేతులు కలిపింది. స్ట్రీట్ లైటింగ్ నేషనల్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎస్‌ఎన్‌ఎల్)లో భాగంగా ఇంటిగ్రేటెడ్ లైటింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎల్ఎమ్ఎస్) ఆధారిత సాంకేతికతతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలుకు సంకల్పించింది.
తొలి దశలో 7.5 లక్షల లైట్లు
ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 10.5 లక్షల వీధి దీపాలను ఆధునీకరించాలని ప్రతిపాదించారు. మొదటి దశలో 7.5 లక్షల వీధి దీపాలను ఆధునికీకరిస్తారు. రెండో దశలో 3 లక్షల వీధి దీపాలను ఆధునికీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న వీధి దీపాల వెలుతురు సామర్థ్యం 100 ల్యూమెన్స్ కాగా, కొత్తగా ఏర్పాటు చేసే ఎల్ఈడీ దీపాల సామర్థ్యం 150 ల్యూమెన్స్. దీంతో వీధులు మరింత ప్రకాశవంతంగా వెలుగులీననున్నాయి.
ఆరు నెలల్లో పూర్తి..
ప్రాజెక్టు పురోగతిపై మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, సీడీఎంఏ సంపత్ కుమార్ కలిసి ఈఈఎస్ఎల్ సీఈఓ అఖిలేష్ కుమార్ దీక్షిత్, సీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లా రెడ్డిలతో వర్చువల్ సమీక్ష నిర్వహించారు. ఒప్పందం కుదిరిన ఆరు నెలల్లోగా ప్రాజెక్టు పూర్తి చేయాలని సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
స్మార్ట్ ప్రాజెక్టుతో ప్రయోజనాలు
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా: ఇంటిగ్రేటెడ్ లైటింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐఎల్ఎమ్ఎస్) ద్వారా ప్రతి స్తంభాన్ని రియల్ టైమ్‌లో పర్యవేక్షించవచ్చు. ఎక్కడైనా దీపం వెలగకపోతే వెంటనే గుర్తించి సరిచేసే వీలుంటుంది.
తగ్గనున్న ఆర్థిక భారం: కనీసం 30 శాతం ఇంధన ఆదా వల్ల పట్టణ స్థానిక సంస్థల విద్యుత్ బిల్లులు భారీగా తగ్గనున్నాయి. ఆ నిధులు ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చు.
మెరుగైన ప్రజా రక్షణ: 150 ల్యూమెన్స్ సామర్థ్యం గల దీపాలతో రాత్రి వేళల్లో రోడ్లపై వెలుతురు పెరుగుతుంది. రక్షణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.
పర్యావరణ పరిరక్షణ: విద్యుత్ వినియోగం నియంత్రణలోకి రావడంతో కర్బన ఉద్గారాల ప్రభావం కొంత మేర తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది.
