AP | మీ ఇంటి కుటుంబ సభ్యుడిననే – ఎంపీ కేశినేని చిన్ని
AP | మీ ఇంటి కుటుంబ సభ్యుడిననే – ఎంపీ కేశినేని చిన్ని
- వత్సవాయి మండల టీడీపీ నేతలతో ఆత్మీయ సమావేశం
- కేడర్ సమస్యలు తెలుసుకునేందుకు కొత్త విధానానికి శ్రీకారం
- కార్యకర్తలతో సహపంక్తి భోజనం చేసిన ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే తాతయ్య
- పార్టీ బలోపేతానికి సమష్టి కృషి అవసరమని పిలుపు
ఆంధ్రప్రభ, విజయవాడ : పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి నిజమైన బలమని, వారి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎంపీ చిన్ని తన కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు, అభిప్రాయాలు, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రజాప్రతినిధిగా రెండేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కేడర్‌తో మరింత మమేకమవుతూ వారి కష్టసుఖాలు తెలుసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎంపీ చిన్ని, ప్రతి నాయకుడితో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలు, పార్టీ పరిస్థితులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నియోజకవర్గంలో గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం కొనసాగుతున్న పనులు, భవిష్యత్తు ప్రణాళికలు, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలు, పార్టీ విస్తరణ వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, లక్షలాది కార్యకర్తల కుటుంబమని అన్నారు. వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి అందరూ పార్టీ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అసంతృప్తితో ఉన్న నాయకులను కూడా కలుపుకుని వెళ్లినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హుడికి చేరేలా క్షేత్రస్థాయిలో నాయకులు మరింత చొరవ చూపాలని సూచించారు. సమావేశం అనంతరం ఎంపీ చిన్ని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) కార్యకర్తలు, మండల నాయకులతో కలిసి ఆత్మీయ విందులో పాల్గొని సహపంక్తి భోజనం చేశారు.
ఎంపీ హోదాలో ఉన్నప్పటికీ ఎలాంటి ఆడంబరాలకు తావివ్వకుండా సాధారణ కార్యకర్తలా అందరితో కలిసిపోవడం, వారి అభిప్రాయాలను ఓపికగా వినడం కేడర్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని, వారి సంక్షేమం, గౌరవం పార్టీకి అత్యంత ప్రాధాన్యమని అన్నారు.
ఎంపీ చిన్ని నిరంతరం కేడర్‌తో మమేకమవుతూ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారని కొనియాడారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తే జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
వత్సవాయి మండల నేతలతో జరిగిన ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపడంతో పాటు భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు దిశానిర్దేశం చేసిన కీలక సమావేశంగా నిలిచిందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.




