సత్తెనపల్లిలో కార్డన్ సెర్చ్…..!

సత్తెనపల్లిలో కార్డన్ సెర్చ్…..!

81 ద్విచక్ర వాహనాలు, కారు, ఆటో సీజ్…!

పల్నాడు ప్రతినిధి ,ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేట, నాగన్నకుంట ప్రాంతంలో శనివారం విస్తృత స్థాయి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 81 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ…, స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన యజమానులు అధికారిక పత్రాలను సమర్పించి ధృవీకరించుకుంటే తిరిగి అప్పగిస్తామని తెలిపారు. పత్రాలు సమర్పించని పక్షంలో స్వాధీనం చేసుకున్న వాహనాలను సోమవారం కోర్టుకు అప్పగించనున్నట్లు చెప్పారు. గతంలో రంగా కాలనీలో కూడా ఇలాంటి కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పేర్కొన్న ఆయన, నాగన్నకుంట ప్రాంతంలో గంజాయి విక్రయాలు, కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్నట్లు అందిన సమాచారంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు కాలేజీకి వెళ్లే సమయంలో వారి స్నేహాలు, సంచారాలపై నిఘా ఉంచాలని, చెడు అలవాట్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో సుమారు 180 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.