ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనపై కఠిన చర్యలు
ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనపై కఠిన చర్యలు
తాడిగడప మున్సిపాలిటీలో సెన్సస్ విధుల్లో నిర్లక్ష్యం వ్యవహారం కలకలం రేపుతోంది.
పెనమలూరు – ఆంధ్రప్రభ : విధులకు గైర్హాజరు, శిక్షణ తరగతులకు హాజరు కాకపోవడం, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలతో 10 మంది రిసోర్స్ పర్సన్స్‌ను సస్పెండ్ చేస్తూ మెప్మా మిషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ కార్యక్రమంలో అదనపు సిబ్బందిగా మెప్మా రిసోర్స్ పర్సన్స్‌ను నియమించారు. మొత్తం 30 మంది రిసోర్స్ పర్సన్స్‌కు సూపర్వైజర్, ఎన్యూమరేటర్ బాధ్యతలు అప్పగించారు.
అయితే వీరిలో కొందరు శిక్షణ కార్యక్రమాలకు హాజరు కాకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం వంటి అంశాలను జిల్లా అధికారులు గుర్తించారు.
దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన మెప్మా అధికారులు 10 మంది రిసోర్స్ పర్సన్స్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెండ్ చేసిన వారిపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా MEPMA ప్రాజెక్ట్ డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
“సెన్సస్ విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.”
