కొండవీడు కోట అభివృద్ధికి నూతన రహదారుల ప్రతిపాదన
కొండవీడు కోట అభివృద్ధికి నూతన రహదారుల ప్రతిపాదన
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ:
పల్నాడు జిల్లాలోని చారిత్రాత్మక కొండవీడు కోటను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, జాతీయ రహదారుల నుండి కోటకు మెరుగైన కనెక్టివిటీ కల్పించాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, టీడీపీ లోక్‌సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ.. కొండవీడు కోట పర్యాటక ప్రగతికి రెండు కీలకమైన 4 లేన్ల అనుసంధాన రహదారులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. కొండవీడు కోటకు వందల ఏళ్ల వైభవ చరిత్ర ఉందన్నారు. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో నిర్మితమై, విజయనగర సామ్రాజ్య వైభవానికి సాక్ష్యంగా నిలిచిన కొండవీడు కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ చారిత్రక ప్రాంతానికి మెరుగైన రహదారులు అందుబాటులోకి వస్తే పర్యాటకంగానే కాకుండా, సామాజికంగా, ఆర్థికంగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
కోట పర్యాటక అభివృద్ధికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రెండు ముఖ్యమైన రహదారులను ప్రతిపాదించారు. ఇందులో మొదటిది అనంతపూర్ – గుంటూరు జాతీయ రహదారి 544D జంక్షన్ అయిన ఫిరంగిపురం నుండి గణేశ్వరపాడు వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారి కాగా, రెండోది చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారి 16 జంక్షన్ అయిన బోయపాలెం నుండి గణేశ్వరపాడు వరకు దాదాపు 6 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారి. మొత్తం 9 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రెండు అనుసంధాన రహదారుల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
