Vijayawada | సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం..
Vijayawada | సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం..
- గంటల తరబడి ఎదురుచూపు లేకుండా..
- ఇంద్రకీలాద్రిపై సరికొత్త మార్పులు..
- క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్న ఈవో..
Vijayawada | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ వారికి శీగ్ర దర్శనం కలిగించేలా సమూల మార్పులకు ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆలయ కార్యనిర్వాహకాధికారి వి.కే. శీనానాయక్ చేపట్టిన సరికొత్త వ్యూహాలు క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పులకు దారి తీస్తూ భక్తుల నుంచి విస్తృత ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రత్యక్ష పర్యవేక్షణ, క్రమశిక్షణ, పారదర్శకతే లక్ష్యంగా అమలు చేస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అన్ని క్యూలైన్లు కలిసే ప్రధాన స్కానింగ్ పాయింట్‌ను కేంద్రంగా చేసుకుని ఈఓ శీనానాయక్ స్వయంగా కూర్చుని పర్యవేక్షించడం తో అమ్మవారి దర్శనం కూడా భక్తులకు త్వరితగతిన పూర్తవుతుంది. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంతో భక్తుల నుండి ప్రశంసలు వస్తున్నాయి.

క్యూలైన్లను క్రమబద్ధీకరించడం, దర్శన ప్రక్రియలో పారదర్శకత పెంచడం వల్ల ఆలయ ఆదాయం స్పష్టంగా పెరిగినట్లు దేవస్థాన వర్గాలు చెబుతున్నాయి. ఇంతకు ముందు కనిపించిన గందరగోళం తగ్గి, వ్యవస్థబద్ధమైన నిర్వహణతో హుండీ ఆదాయం సహా ఇతర విభాగాల్లోనూ సానుకూల ఫలితాలు నమోదవుతున్నాయి.
భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా, అన్ని క్యూలైన్లు వేగంగా కదిలేలా తీసుకున్న చర్యలు సామాన్య భక్తులకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. తక్కువ సమయంలో అమ్మవారి దర్శనం కలగడం పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా, ప్రోటోకాల్ లేని అనధికారిక వీఐపీ దర్శనాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడం ద్వారా సామాన్య భక్తులకు ప్రాధాన్యత లభిస్తోంది. దర్శన వ్యవస్థలో సమానత్వాన్ని నెలకొల్పిన ఈ నిర్ణయం భక్తుల మన్ననలు పొందుతోంది. సిబ్బందిలోనూ క్రమశిక్షణ పెంచేందుకు ఈఓ శీనానాయక్ నిరంతరం వైర్‌లెస్ వ్యవస్థ ద్వారా సమన్వయం చేస్తూ ఆలయ యంత్రాంగాన్ని చురుకుగా నడిపిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెరగడంతో పనుల అమలు వేగవంతమైంది.
