రహదారులపై జంతువులు వదిలితే కఠిన చర్యలు

రహదారులపై జంతువులు వదిలితే కఠిన చర్యలు

-నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరిక

  • ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే యజమానులపై చర్యలు

కర్నూలు కార్పొరేషన్, ఆంధ్రప్రభ నగరంలో రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో పశువులను వదిలి ప్రజా భద్రతకు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న పశువులను ప్రత్యేక బృందాలతో గుర్తించి పట్టుకుని గోశాలలకు తరలిస్తామని పేర్కొన్నారు. పశువులను రోడ్లపై వదిలే యజమానులపై మున్సిపల్ చట్టాల ప్రకారం గోశాలలకు అప్పగించడం, యజమానులకు జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు.

నగర పరిధిలో పశువులను నిర్లక్ష్యంగా వదిలేయడం నేరంగా పరిగణించబడుతుందని, ప్రజల భద్రత , ట్రాఫిక్ సౌకర్యం దృష్ట్యా ఇటువంటి చర్యలను పూర్తిగా నియంత్రించాలని కమిషనర్ పేర్కొన్నారు. ఇకపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి పశువులను స్వాధీనం చేసుకుని గోశాలలకు తరలించడం, యజమానులపై జరిమానాలు విధించడం వంటి చర్యలను క్రమం తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు.

ప్రజలు, పశువుల యజమానులు తమ జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యం కోసం సహకరించాలని కమిషనర్ చల్లా ఓబులేసు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply