సంప్రదాయబద్ధంగా శాకంభరీ ఉత్సవం ఘనం
- శ్రీ భ్రమరాంబాదేవికి శాకాలంకరణ..
- లోకకల్యాణం కోసం ప్రత్యేక పూజలు
నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన, జ్యోతిర్లింగ క్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాల పండ్లతో శ్రీ భ్రమరాంబాదేవి మూలమూర్తి, ఉత్సవమూర్తి, ఆలయ ప్రాంగణంలోని రాజరాజేశ్వరి అమ్మవారు, అన్నపూర్ణాదేవి అమ్మవారు, గ్రామదేవత అంకాళమ్మ అమ్మవారికి శాకాలంకరణ నిర్వహించి, ఉత్సవ సంబంధిత పూజాదికాలు శాస్త్రోక్తంగా జరిపించారు.
ఉత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇందుకోసం సుమారు 9 వేల కిలోలకు పైగా వివిధ రకాల కూరగాయలు, 200 గుమ్మడికాయలు, 4 వేలకుపైగా నిమ్మకాయలు, 1,200కుపైగా పది రకాల ఆకుకూరల కట్టలు, వివిధ రకాల పండ్లను వినియోగించారు.
వంగ, బెండ, దొండ, కాకర, చిక్కుడు, గోరుచిక్కుడు, మునగ, సొర, పొట్ల, బీర, గుమ్మడి, బంగాళదుంప, కందదుంప, క్యాప్సికమ్ (బెంగుళూరు మిరప), క్యాబేజీ, బీన్స్, క్యారెట్, అరటి వంటి కూరగాయలు, తోటకూర, పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వంటి సుగంధ పత్రాలు, కమల, బత్తాయి, ద్రాక్ష, ఆపిల్, అరటి, ఫైనాపిల్ తదితర పండ్లు, నిమ్మకాయలు, బాదంకాయలను ఉత్సవానికి ప్రత్యేకంగా తెప్పించినట్లు తెలిపారు.
ఆగమశాస్త్రానుసారం శ్రీ భ్రమరాంబాదేవికి ఉత్సవ సంబంధిత పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముందు వేదపండితులు వేదపారాయణం చేయగా, అనంతరం అర్చక స్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఉత్సవ సంకల్పాన్ని పఠించారు.
సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని సంకల్పంలో ప్రార్థించారు. అనంతరం ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగాలని మహాగణపతి పూజ నిర్వహించారు. అలాగే శాకంభరీగా అలంకరించిన అమ్మవారి ఉత్సవమూర్తికి విశేషంగా షోడశోపచార పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శాకంభరీ దేవి అవతార విశిష్టతను వివరించారు. పూర్వం హిరణ్యాక్షుని వంశానికి చెందిన దుర్గముడు అనే రాక్షసుడు తన తపశ్శక్తితో వేదాలను అంతర్థానం చేయడంతో యజ్ఞయాగాదులు నిలిచిపోయి, ప్రపంచంలో తీవ్ర కరువు ఏర్పడిందని పేర్కొన్నారు. అప్పుడు మహర్షులు ఆదిపరాశక్తిని ఆరాధించగా, ఆమె దుర్గముడిని సంహరించి వేదాలను తిరిగి అందించి వైదిక కర్మలను పునరుద్ధరించిందన్నారు. అనంతరం తన నుంచే వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను సృష్టించి క్షామాన్ని నివారించిందని, ఆ స్వరూపమే శాకంభరీదేవి అని వివరించారు.
ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారిని శాకాలతో అర్చించడం వల్ల అతివృష్టి, అనావృష్టి నివారించబడి, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండుతాయని, కరువుకాటకాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయని తెలిపారు. అందుకే లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ప్రతి సంవత్సరం ఆగమశాస్త్రోక్తంగా ఈ కైంకర్యాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి. రమణ, బోనేని రమణమ్మ, చిట్టిబొట్ల భరద్వాజశర్మ, జి. లక్ష్మేశ్వరి, కోడె కాంతివర్ధిని, మేడా మురళీధర్, ఉప్పుటూరి సుబ్బలక్ష్మి, పి.యూ. శివమ్మ, జిల్లెల శ్రీదేవి, ప్రత్యేక ఆహ్వానితులు ఆకుల శ్రీనివాసులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, పలువురు అర్చక స్వాములు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

