History Survey : నల్లమలలో హిస్టరీ సర్వే Andhra Prabha Top News

History Survey : నల్లమలలో హిస్టరీ సర్వే Andhra Prabha Top News

  • ఏఎస్ఐకి ఏపీ అనుమతి
  • అటవీ శాఖ సహకారం
  • డిప్యూటీ సీఎం శుభాకాంక్షలు
  • ఎకో టూరిజం అభివృద్ధికి ఈ సర్వే ఊతం

(నంద్యాల , ఆంధ్రప్రభ బ్యూరో )

అడవులు జీవ వైవిధ్యంతో పాటు చారిత్రక పురావస్తు, సాంస్కృతిక సంపదకు నిలయాలు. అలాంటి అమూల్య వారసత్వ సంపదను గుర్తించి, సంరక్షించడంతోపాటు మన చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి , అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలు, పురావస్తు అవశేషాలు ఎకో టూరిజం అభివృద్ధికి సరికొత్త అవకాశాలు సృష్టిస్తాయని తెలిపారు. ప్రకృతి, వారసత్వ సంపదల పట్ల ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. నల్లమల అటవీ ప్రాంతంలో దాగి ఉన్న అమూల్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తించి, సంరక్షించేందుకు, శాసనాల సర్వే నిర్వహించేందుకు భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

History Survey : లంకమల అడవిలో

గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో క్రీస్తు పూర్వ 1వ శతాబ్దం నుంచి క్రీస్తుశకం 16వ శతాబ్దం వరకు సుమారు 30 శాసనాలు వెలుగు చూశాయి. 10 వేల సంవత్సరాల నాటి గుహ చిత్రాలను గుర్తించారు. ఈ శాసనాలు శాతవాహనుల కాలం, బౌద్ద, శైవ సంప్రదాయాలతో పాటు ప్రాచీన యాత్రా మార్గాలను, ఆది మానవ జీవన విధానాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని వెలుగులోకి తెచ్చాయి.

History Survey : నల్లమలలో

భారత పురావస్తు సంస్థ చేపట్టనున్న తాజా సర్వే తెలుగు, దేవనగరి లిపిల్లో లిఖించిన శాసనాలపై దృష్టి సారించి మన ప్రాచీన రాజ్యాలు, సంస్కృతి, సంప్రదాయాలు, దక్షిణ భారత చరిత్రను మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కల్పిస్తుంది. ఈ సర్వేపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఏఎస్ఐ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ “వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పరిరక్షణ లక్ష్యాలకు భంగం కలగకుండా రాష్ట్ర అటవీ శాఖ అధికారులు పూర్తి సహకారం అందించాలి. ప్రకృతి సంపదతోపాటు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ భావితరాలకు అందించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంద”న్నారు.

Leave a Reply