హెపటైటిస్‌పై అప్రమత్తతే కాలేయానికి రక్షణ

  • నేడు ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం
  • మెడికవర్ ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం

కర్నూలు, ఆంధ్రప్రభ: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో మంగళవారం హెపటైటిస్ వ్యాధి, కాలేయ ఆరోగ్యం, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది “హెపటైటిస్: లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్” అనే అంశంతో నిర్వహించిన కార్యక్రమంలో హెపటైటిస్‌పై ఉన్న అపోహలను తొలగించి, ప్రతి ఒక్కరూ సమయానికి పరీక్షలు చేయించుకోవడం, చికిత్స పొందడం ఎంత ముఖ్యమో వివరించారు.

ఈ సందర్భంగా మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డా. పి. అబ్దుల్ సమద్ మాట్లాడుతూ హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందన్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని, నిర్లక్ష్యం చేస్తే లివర్ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్, లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు.

హెపటైటిస్ వ్యాధి చాలా సందర్భాల్లో ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవని, అందువల్ల ప్రమాదానికి గురయ్యే వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెపటైటిస్-బి వ్యాక్సిన్ తీసుకోవడం, సురక్షిత రక్త మార్పిడి, ఒక్కసారి మాత్రమే ఉపయోగించే సూదులను వినియోగించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే కాలేయాన్ని పూర్తిగా కాపాడుకోవచ్చన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న రోగులు, వారి కుటుంబ సభ్యులు హెపటైటిస్, కాలేయ ఆరోగ్యం, వ్యాక్సినేషన్, పరీక్షలు, చికిత్సకు సంబంధించిన పలు సందేహాలను వ్యక్తం చేయగా, డా. అబ్దుల్ సమద్ వాటికి సమగ్ర వివరణ ఇచ్చి అవగాహన కల్పించారు.

మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ హెపటైటిస్‌పై ప్రజల్లో సరైన అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన వ్యాక్సిన్లు తీసుకోవడం, నిపుణుల సూచనలు పాటించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్ నిరంతరం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యాధునిక గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ సేవలను అందిస్తోందని పేర్కొన్నారు.