పన్ను వసూళ్ల కేంద్రాలు.. ప్రతిరోజు 14 గంటలు

పన్ను వసూళ్ల కేంద్రాలు.. ప్రతిరోజు 14 గంటలు
- నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ: ఆస్తి పన్ను చెల్లింపులపై రాయితీ పొందడానికి గడువు మరో మూడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో, వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా పన్ను వసూళ్ల కేంద్రాల పని వేళలను పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నగరపాలక పాత, తాత్కాలిక కార్యాలయాల్లో ఉన్న పన్ను చెల్లింపు కేంద్రాలతో పాటు వివిధ సచివాలయాల్లో ఉన్న కౌంటర్లు సైతం ప్రతిరోజు 14 గంటలపాటు తెరిచి ఉంటాయన్నారు. నగరపాలక పాత, తాత్కాలిక కార్యాలయాల్లో అదనపు కౌంటర్లు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆస్తి పన్ను బకాయిలను ఏకమొత్తంలో చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ముందస్తుగా ఏకమొత్తంలో చెల్లించిన వారికి 5 శాతం రాయితీని వినియోగించుకునే వెసులుబాటు ఏప్రిల్ 30 వరకు మాత్రమే ఉందని కమిషనర్ పేర్కొన్నారు. కావున పన్నుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కమిషనర్ కోరారు.
పన్ను చెల్లింపులకు ప్రత్యేక కౌంటర్లు:
- నగరపాలక పాత, తాత్కాలిక కార్యాలయాలు
- దండిగేరి, పెద్దపడఖాప 20,21వ సచివాలయాలు
- బి.క్యాంపు, అరోరా నగర్ 56,57వ సచివాలయాలు
- గురు రాఘవేంద్ర నగర్, రాజీవ్ గృహకల్ప 92,93వ సచివాలయాలు
- కల్లూరు వార్డు కార్యాలయం 84,85వ సచివాలయాలు
- లక్ష్మీనగర్, జెఎన్ఆర్ నగర్ 61,62వ సచివాలయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు
