అర్జీలకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది

అర్జీలకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది
- ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు, ఆంధ్రప్రభ: ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశతో మనకు అర్జీలు ఇస్తూ ఉంటారని వాటిని సీరియస్ గా తీసుకొని సమర్థవంతంగా పనిచేసి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. శుక్రవారం టిడిపి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఎమ్మెల్యే సునీత ప్రతి ఒక్కరితో ఓపిగ్గా మాట్లాడుతూ వారి సమస్యలు విని అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలపై స్పందిస్తూ ఇలాంటి సమస్యలు స్థానికంగా ఉన్న సచివాలయాలు తహసీల్దార్ కార్యాలయంలోనే పరిష్కారం అవతాయని ఇంత దూరం రావాల్సిన అవసరం లేదన్నారు.
అక్కడ ఎవరైనా స్పందించకపోతే తాము చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీలు ఎక్కువగా రెవెన్యూ పంచాయతీ రాజ్ విద్యుత్ శాఖలకు సంబంధించినవి వస్తున్నాయన్నారు.వీటిలో కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు.రెవెన్యూ విభాగంలో వచ్చే సమస్యల పట్ల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే రీ సర్వే ద్వారా చాలా సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నామన్నారు. అధికారులు మరింత చొరవ తీసుకుంటే 90 శాతం వరకు ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారం అవుతాయన్నారు.
చిన్న చిన్న విషయాలకు కోర్టుల వరకు వెళ్లి సమస్యలు పెద్దవి చేసుకోవద్దని దాని వలన ఇరుపక్షాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.సామరస్య పూర్వకంగానే సమస్యలను పరిష్కరించుకోవాలి తెలిపారు.ఈ విషయంలో గ్రామ పెద్దలు కూడా చొరవ తీసుకోవాలన్నారు.ఇక పింఛన్లు ఇళ్ల స్థలాలు త్వరలోనే అందిస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దని తెలియజేశారు.
