ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం లక్ష్యం

ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడం లక్ష్యం
- ఎమ్మెల్యే గిత్త జయసూర్య
నందికొట్కూర్, ఆంధ్రప్రభ: నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తహసీల్దార్ శివరాముడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య హజరయ్యారు. పగిడ్యాల మండల నలుమూలల నుండి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలను ఎమ్మెల్యేకి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల నిమిత్తం కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు సానుకూలంగా స్పందించి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. పగిడ్యాల మండల అభివృద్ధి లక్ష్యంగా మీ సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అని అన్నారు.
అనంతరం ప్రాతకోట గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు తన గోడు వెళ్లబోసుకున్నారు. వాల్టా చట్టం కొందరికి చుట్టంగా మారింది. సంబంధిత శాఖలకు చెందిన కిందిస్థాయి అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. నిరంతర విద్యుత్తు సరఫరాతో సాగు విస్తీర్ణం పెరిగి నీటి వినియోగం తారాస్థాయికి చేరింది. దీంతో అధికారుల అనుమతుల్లేకుండానే చాలామంది బోరుబావులు తవ్వుతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. సంబంధిత శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. రైతే రాజు అనేది కేవలం మాటలకే పరిమితమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో బోర్లు వేసుకుంటే వాల్టా చట్టం పేరిట అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని, అధికారుల వేధింపులు ఆపాలని ఆయన కోరారు. ఎన్నిసార్లు వాల్టా చట్టం అధికారులు రైతుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ నంద్యాల వాల్టా కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు తప్ప సమస్య పరిష్కారం కావడం లేదని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు టిడిపి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
