ఉద్యోగ భద్రత కల్పించాలి..

  • ఏడీఏకు వినతిపత్రం సమర్పించిన ఎంపీఈవోలుసమాన పనికి
  • సమాన వేతనం, పెండింగ్ జీతాల విడుదలకు డిమాండ్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న బహుళ ప్రయోజన విస్తరణ అధికారులకు (ఎంపీఈవోలు) ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శుక్రవారం ఉరవకొండ వ్యవసాయ డివిజన్‌లో పనిచేస్తున్న ఎంపీఈవోలు పెన్‌డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సహాయ సంచాలకుల (ఏడీఏ) కార్యాలయంలో ఏడీఏ సత్యనారాయణకు వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ఉరవకొండ వ్యవసాయ డివిజన్ సంఘం అధ్యక్షుడు బూదగవి గంగన్న, ఉపాధ్యక్షురాలు బండి హేమ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా గ్రామాల్లో బహుళ ప్రయోజన విస్తరణ అధికారులుగా సేవలందిస్తున్నామని తెలిపారు. నెలకు కేవలం రూ.12 వేల వేతనం, రూ.3 వేల ఇన్సెంటివ్ మాత్రమే అందుతున్నాయని పేర్కొన్నారు. గత నాలుగు నెలలుగా జీతాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం కింద నెలకు రూ.35 వేల వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని కోరారు. విధి నిర్వహణలో ఉద్యోగి మరణిస్తే ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ట్రెజరర్ మోహన్ నాయక్‌తో పాటు పలువురు బహుళ ప్రయోజన విస్తరణ అధికారులు (ఎంపీఈవోలు) పాల్గొన్నారు.