కదిరి క్రీడాకారిణి శైలజకు ఘన సత్కారం..
కదిరి క్రీడాకారిణి శైలజకు ఘన సత్కారం..
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ పోటీల్లో భారత్ జట్టు విజయంలో భాగస్వామ్యమైన కదిరి వాసి శైలజను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఘనంగా సత్కరించారు. శ్రీలంక దేశంలోని కొలంబోలో ఈ నెల 24 నుండి 28వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణ ఆసియా గోల్ షాట్ బాల్ పోటీల్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో విజయం సాధించింది. ఈ జట్టులో కదిరి క్రీడాకారిణి శైలజ పాల్గొని తన ప్రతిభను చాటుకుంది. విజయంతో స్వగ్రామానికి చేరుకున్న శైలజ, కదిరి ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కదిరి ప్రాంతానికి చెందిన శైలజ అంతర్జాతీయ స్థాయిలో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి విజయం సాధించడం గర్వకారణమన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో భారత్-శ్రీలంక జట్లు తలపడగా, శైలజ నాలుగు గోల్స్ సాధించి జట్టు విజయానికి కీలకంగా నిలిచిందని తెలిపారు. భవిష్యత్తులో శైలజ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శైలజకు అభినందనలు తెలియజేసి 🥇 బంగారు పతకంతో ఎమ్మెల్యే సత్కరించారు.
