బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!

బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!

  • మోపిదేవిలో కలకలం
  • చల్లపల్లిలో బంధువులతో కలిసి డ్రైవర్‌పై దాడి చేయించిన వైనం

మోపిదేవి, ఆంధ్రప్రభ: బస్సు ఆపలేదన్న చిన్న కారణంతో ఓ మహిళా ప్రయాణికురాలు ఆర్టీసీ డ్రైవర్‌పై అత్యంత దురుసుగా ప్రవర్తించిన ఘటన మోపిదేవిలో శుక్రవారం చోటుచేసుకుంది. డ్రైవర్‌ను అందరి ముందు చెప్పుతో కొట్టడమే కాకుండా, తన బంధువులను పిలిపించి మరీ దాడి చేయించడం స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న కరకట్ట బస్సును పులిగడ్డ వంతెనపై ఎక్కేందుకు సదరు మహిళ చేయి చూపింది. అయితే డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్ళిపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె, బస్సును వెంబడించి మోపిదేవి ప్రధాన సెంటర్‌లో బస్సు ఎక్కింది.

బస్సు ఎక్కిన వెంటనే డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన ఆమె, సహనం కోల్పోయి అందరూ చూస్తుండగానే తన చెప్పు తీసి డ్రైవర్ చెంపపై కొట్టింది. అంతటితో ఆగకుండా ఆమె తన బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. బస్సు చల్లపల్లి బస్ స్టాప్‌నకు చేరుకోగానే, అక్కడకు చేరుకున్న ఆమె బంధువులు డ్రైవర్‌పై భౌతిక దాడికి దిగారు.

ఈ క్రమంలో బస్ స్టాప్‌ వద్ద ఆర్టీసీ ఉద్యోగులకు, మహిళా బంధువులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. గొడవ పెద్దదవుతున్న తరుణంలో, మహిళకు బంధువైన ఒక కానిస్టేబుల్ రంగప్రవేశం చేసి, గొడవను పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం.

“కేవలం బస్సు ఆపలేదన్న కారణంతో విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్‌పై ఇలా దాడి చేయడం ఎంతవరకు సమంజసం?” అని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరిదని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Leave a Reply